బ్లూ బార్డ్ ప్రయోగం విజయవంతం.. అమెరికా శాటిలైట్‌ను కక్ష్యలోకి చేర్చిన ఇస్రో

ISRO's LVM3 M6 Deploys US Satellite BlueBird Block-2 Successfully

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 8గంటల 55నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన LVM3 M6 (బాహుబలి) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థకు చెందిన అతిపెద్ద వాణిజ్య ఉపగ్రహం బ్లూ బార్డ్ బ్లాక్-2ను ఈ రాకెట్ దిగ్విజయంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో నూతన చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ నేతృత్వంలో జరిగిన ఈ భారీ మిషన్, భారత అంతరిక్ష రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

మిషన్ విజయ విశేషాలు:
  • నిర్ణీత సమయానికి ప్రయోగం: బుధవారం ఉదయం షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన 15 నిమిషాల 7 సెకన్లలోనే శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ఉంచి తన సత్తా చాటింది.

  • భారీ ఉపగ్రహం: సుమారు 6100 కిలోల బరువున్న బ్లూ బార్డ్ బ్లాక్-2 ఉపగ్రహం గతంలో పంపిన శాటిలైట్ల కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీని మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత వేగవంతం చేయనుంది.

  • వరుసగా ఎనిమిదో విజయం: 43.5 మీటర్ల పొడవైన LVM3 రాకెట్ దీనిని మోసుకెళ్లి వియజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, ఈ LVM3 సిరీస్‌లో ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. దీనితో ఈ రాకెట్ అత్యంత విశ్వసనీయమైన లాంచ్ వెహికల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

  • వాణిజ్య మైలురాయి: ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (NSIL) ద్వారా జరిగిన ఈ ప్రయోగం, అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో భారత్ ఒక అగ్రగామిగా ఎదిగిందని మరోసారి నిరూపించింది.

డాక్టర్ వి. నారాయణన్ ఉద్వేగం:

ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయం ఇస్రో జట్టు కృషికి నిదర్శనమని, రాబోయే గగన్‌యాన్ ప్రాజెక్టులకు ఇది ఒక పెద్ద ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధులు సైతం ఇస్రో కచ్చితత్వాన్ని మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగ సామర్థ్యాన్ని కొనియాడారు.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బాహుబలి రాకెట్ విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్తోంది. ఈ ప్రయోగం ద్వారా గ్లోబల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ హర్షం

ఇక ఇస్రో ప్రయాగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన పురోగతి… భారత నేల నుండి ఇప్పటివరకు ప్రయోగించబడిన అత్యంత బరువైన ఉపగ్రహం, USA యొక్క అంతరిక్ష నౌక, బ్లూబర్డ్ బ్లాక్-2 ను దాని ఉద్దేశించిన కక్ష్యలోకి చేర్చిన విజయవంతమైన LVM3-M6 ప్రయోగం, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో గర్వించదగిన మైలురాయిని సూచిస్తుంది.”

“ఇది భారతదేశం యొక్క భారీ-లిఫ్ట్ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది మరియు ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్‌లో మన పెరుగుతున్న పాత్రను బలోపేతం చేస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను కూడా ప్రతిబింబిస్తుంది. మన కష్టపడి పనిచేసే అంతరిక్ష శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లకు అభినందనలు. అంతరిక్ష ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థాయికి ఎదుగుతూనే ఉంది!” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here