తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం.. పార్టీలో భారీగా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే 65 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. సీనియర్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే తన కేబినెట్‌లో కూడా భారీగా మార్పులు చేసేందుకు స్టాలిన్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా తన కుమారుడు ఉదయ నిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం చేసేందుకు ఎంకే స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారట.
తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. మరో ఏడాదిన్నరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో భవిష్యత్ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఎంకే స్టాలిన్ తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంకే స్టాలిన్ తండ్రి కరుణానిధి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. అందువల్ల ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వడం ఆలస్యమయింది. రాజకీయాల్లోకి వచ్చిన 40 ఏళ్ల తర్వాత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తన కుమారుడిని మాత్రం వీలైనంత త్వరగా ముఖ్యమంత్రిని చేయాలని ఎంకే స్టాలిన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన్ను సిద్ధం చేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే త్వరలో కేబినెట్‌లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని స్టాలిన్ నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోని సీనియర్ లీడర్లు, మంత్రులే ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారట. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఉదయనిధి స్టాలిన్ త్వరలో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలోనే స్టాలిన్ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్‌లో సీనియర్ మంత్రుల శాఖలను కూడా మార్చేందుకు స్టాలిన్ కసరత్తు చేస్తున్నారట. అతి త్వరలోనే తమిళనాడు కేబినెట్‌లో భారీగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY