సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ బుధవారం ఉదయం ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చేత ప్రమాణం చేయించారు. 2024, నవంబర్ 10 వరకు జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్, మాజీ సీజేఐ యు.యు.లలిత్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజ్జు, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారమానంతరం వారంతా సీజేఐ డి.వై.చంద్రచూడ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ యు.యు.లలిత్ తన తరువాత అనుభవజ్ఞుడు, సీనియర్ అయిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేరును సుప్రీంకోర్టు 50వ సీజేగా ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రతిపాదనలను ఆమోదించి, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నవంబర్ 8న జస్టిస్ యు.యు.లలిత్ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 9, బుధవారం ఉదయం జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేపథ్యం:
జస్టిస్ డి.వై.చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్, ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుండి ఎల్ఎల్బీ చేశారు. యూఎస్ఏలోని హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎం డిగ్రీ మరియు జురిడికల్ సైన్సెస్ లో డాక్టరేట్ పొందారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ, హార్వర్డ్ లా స్కూల్, యేల్ లా స్కూల్ మరియు యూనివర్శిటీ ఆఫ్ విట్వాటర్‌రాండ్, సౌత్ ఆఫ్రికాలో ఉపన్యాసాలు ఇచ్చారు. మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి హైకమిషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ బ్యాంకు మరియు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో సహా ఐక్యరాజ్యసమితి సంస్థలు నిర్వహించిన సమావేశాలలో స్పీకర్ గా ఉన్నారు. ముంబయి విశ్వవిద్యాలయంలో కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ లా విజిటింగ్ ప్రొఫెసర్ గా, యూఎస్ఏలోని ఓక్లహోమా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
భారత సుప్రీంకోర్టు మరియు బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జూన్ 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 1998 నుండి న్యాయమూర్తిగా నియామకం వరకు అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వర్తించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా 2000, మార్చి 29న నియమించబడగా, 2013, అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగారు. ఇక 2016, మే 13న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులయ్యారు. తాజాగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE