వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ ఎన్నికలతో .. భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ తరహా రాజకీయాలు నిలదొక్కుకుంటాయా లేదా అనేది తేలనుంది. 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రి అయి
అందరినీ ఆశ్చర్యపరిచారు కేజ్రీవాల్. అప్పటికే మూడోసారి ఢిల్లీ సీఎంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు..షీలా దీక్షిత్‌ని ఇంటికి పంపారు. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్‌మీ
పార్టీ విజయం సాధించింది. ఎంతో కాలంగా పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను మట్టి కరిపించింది. ఈ ఘన విజయాలతో ఒక్కసారిగా కేజ్రీవాల్ పేరు మారుమోగిపోయింది.
దేశంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ….ఆప్ మాత్రమే. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్‌లోనూ ఆప్ అధికారంలో ఉంది. ఒక దశలో భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్
అద్భుతాలను సృష్టించారు. అయితే ఆయన ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతే….భారత రాజకీయాల్లో గొప్ప అధ్యాయానికి తెరపడినట్లు అవుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ …ఈసారి కేజ్రీ మార్క్
రాజకీయం ఎలా ఉండబోతుందనే చర్చ నడుస్తోంది.
కేజ్రీవాల్ ప్రారంభ దశలో గొప్ప రాజకీయవేత్తగా జనానికి అనిపించారు. మధ్యతరగతి వారే కాకుండా…..చాలామంది ఆయన విధానాలను సమర్థించారు. ఎవరూ ఊహించని వ్యక్తులను తమ పార్టీ
నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించారు కేజ్రీవాల్. సామాన్యులకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం జనంలో బలపడింది. ఇక 2022 ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ అనూహ్య విజయం
సాధించింది.
అయితే వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓఢిపోతే…..ఆయన తిరిగి కోలుకోవడం చాలా కష్టమే. ఆప్ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా అధికారంలో
ఉండటంతో…..సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. బీజేపీ అదేపనిగా ఆయనను టార్గెట్ చేయడం కూడా ప్రతికూలంగా మారే ఆవకాశాలున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ కేసు మరకలు, జైలుకెళ్లి
రావడం, సీఎంగా అతిషీని ఎంపిక చేయడం , 60 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారనే ఆరోపణలు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి.
అయితే ఇటీవల పలు కారణాలతో ఆప్ ప్రతిష్ట కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా మధ్యతరగతి ప్రజలు కేజ్రీవాల్ పట్ల ఎందుకు అభిమానంగా లేరనేదే పెద్ద సమస్య. ఇక ఈసారి
పొత్తు లేకుండానే ఒంటరిగానే ఆప్ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. దీంతో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీతో కూడా ఆప్ తలపడాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రతికూల పరిస్థితులను
దాటుకుని కేజ్రీవాల్ ఈసారి ఏం మ్యాజిక్ చేయబోతున్నారు..ఓటర్లను ఆప్ వైపు ఎలా తిప్పుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.