కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియా 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లి, అక్కడ జరిగిన ఓ ఘర్షణలో భాగంగా తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017 నుంచి జైల్లో ఉంది. ఈ కేసులో నిమిషా ప్రియపై మానవత్వం, న్యాయ వ్యవస్థల ఎదురీత చర్చనీయాంశంగా మారింది.
తన పాస్‌పోర్టు లాక్కున్న తలాల్‌కు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల అతడు మరణించాడని, ఆ సమయంలో ఉక్కిరిబిక్కిరై మృతదేహాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్లు నిమిషా ప్రియా విచారణలో అంగీకరించింది. 2018లో యెమెన్ ట్రయల్ కోర్టు నిమిషాకు మరణశిక్ష విధించగా, 2023 నవంబరులో యెమెన్ సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది.
బ్లడ్‌మనీనే చివరి అవకాశం
తలాల్ కుటుంబ సభ్యులు “బ్లడ్‌మనీ” కింద భారీ పరిహారం స్వీకరించి ఆమెను క్షమిస్తే మాత్రమే ఈ మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంది. భారత విదేశాంగ శాఖ ఈ పరిహార చర్చలకు సహకరించాలని నిర్ణయించినప్పటికీ, న్యాయవాదుల ఫీజు, నిధుల లేమి వంటి అడ్డంకులు కేసు పరిష్కారంలో జాప్యం కలిగిస్తున్నాయి.
భారత ప్రభుత్వ, కుటుంబ పోరాటం
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, నిమిషా ప్రియకు సాధ్యమైన అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె తల్లి ప్రేమ కుమారి ప్రస్తుతం యెమెన్‌లో ఉంటూ తలాల్ కుటుంబాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. వివాదాల నడుమ నిమిషా ప్రియ జీవితాన్ని కాపాడేందుకు జరిగిన కృషి, ఆమె జీవన్మరణ పోరాటం కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ న్యాయం, మానవత్వాల వైఫల్యాలను ప్రతిబింబిస్తుంది.