ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మూడో రోజుకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలతో ఆధ్యాత్మిక శోభ గగనతాళాలకు చేరుతోంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూ, నదీమతల్లికి హారతులు ఇచ్చి, తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.
మహా కుంభమేళా ప్రత్యేకతగా నిలిచిన ఈ స్నానాల్లో నాగ సాధువులు, మహిళా నాగ సన్యాసులు, అఘోరాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. బూడిద పూసుకున్న సాధువులు త్రిశూలాలు, కత్తులతో పురాతన సంప్రదాయాలను ప్రదర్శిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని భక్తులకు చూపించారు. హెలికాప్టర్ ద్వారా గులాబీ రేకులతో వర్షం కురిపించడంతో ఈ వేడుక మరింత అద్భుతంగా మారింది.
ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేయడం విశేషం. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే పూర్ణ కుంభం, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభం ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా చాటిస్తోంది.
నాగ సాధువులు రాజస్నానం కోసం పూర్వకాల రాజుల మాదిరిగా ఊరేగింపుగా రథాల్లో ఘాట్ వద్దకు చేరుకున్నారు. నదీమతల్లికి స్నానం చేసే సమయంలో భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఈ వేడుక భక్తజన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తోంది.