ఓటు మన బాధ్యత.. చాలా మంది ఆ బాధ్యతను నెరవేర్చడం లేదు. అందుకే ఈసారి ఎన్నికల సంఘం వినూత్నంగా ఆలోచించింది. రారండోయ్ ఓట్ల వేడుకకు అని ఆహ్వానపత్రం ముద్రించింది. ఇంట్లోని అర్హులైన అందరూ తగిన గుర్తింపు కార్డులతో సోమవారం హక్కును వినియోగించుకోవాలని జాతీయ చిహ్నం నాలుగు సింహాల ముద్రతో అభ్యర్థిస్తోంది. వేదిక మీ పోలింగ్ కేంద్రమేనని.. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకు మొదలయ్యే సుముహూర్తం.. సాయంత్రం 5 వరకు ఉంటుందని.. ఏదేని గుర్తింపు కార్డుతో తప్పకుండా హాజరు కావాలని కోరుతోంది. ఇక విందు అంటారా? మీరు వేసే ఓటు ఓ విత్తనం అని.. ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్య మధుర ఫలాలను అందిస్తుందని మంచి మాటలు చెబుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైవిధ్యంగా ఎలక్షన్ కమిషన్ ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తగ్గుతున్న ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంఘాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు.. ప్రముఖ పారిశ్రామి కవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు ఉండే మహానగరం. అక్షరాస్యులు అధికంగా ఉండే గ్రేటర్‌లో ఎన్నికల వేళ నిర్లిప్తత కనిపిస్తోంది. అసెంబ్లీ.. పార్లమెంట్.. జీహెచ్‌ఎంసీ.. ఎన్నిక ఏదైనా ఓటర్లు గడప దాటడం లేదు. 45 నుంచి 50 శాతానికి మించి పోలింగ్ నమోదవడం లేదు. అక్షరాస్యులు, ఉద్యోగులు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదవుతుండగా.. విద్యావంతులుండే హైదరాబాద్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని బస్తీలు, మురికవాడల్లో నమోదవుతోన్న పోలింగ్‌తో పోలిస్తే కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో తక్కువగా ఉండడం గమనార్హం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారుండే ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ నమోదవడం ఆందోళనకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు ఓటు వేయకపోవడంతో సమర్ధ అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతున్నారు. పార్టీల తీరు.. అభ్యర్థులు నచ్చక పోలింగ్‌కు రావడం లేదని కొందరు చెబుతున్నా… అలాంటి పరిస్థితుల్లో నోటాకైనా ఓటు వేయాలని ప్రజాస్వామికవాదులు సూచిస్తున్నారు.
నగరంలో 50 శాతంలోపు పోలింగ్ నమోదవుతోన్న నేపథ్యంలో మెజార్టీ ఓటర్ల ప్రమేయం లేకుండానే ప్రజాప్రతినిధుల ఎన్నిక జరుగుతోంది. వర్షం పడినా.. రోడ్లపై మురుగు పొంగి పొర్లినా… గాలికి చెట్టు కూలినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో హోరెత్తించే నగరవాసుల్లో కొందరు ఓటు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం. ఒక్క ఓటు ఒక్కోసారి అభ్యర్థుల తలరాత మారుస్తుంది గెలుపోటములను నిర్ణయిస్తుంది. మనం ఒక్కరం ఓటు వేయకుంటే ఏమౌతుందిలో అనే భావన వీడాలని ప్రముఖులు సూచిస్తున్నారు. బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి కానీ.. ఇంటింటికి వెళ్లి కోరినా.. ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రముఖుల సందేశాలతో ప్రచారం చేస్తోన్నా నగరవాసులు కొందరి తీరు మారడం లేదు. హైదరాబాద్ ఓటర్లు లారా.. ఈసారైనా బయటకు రండి.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో పాల్గొనండి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY