మహాకుంభ మేళా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మేళాలో పాల్గొని పుణ్యస్నానం చేయాలని లక్షలాది భక్తులు భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమానికి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ నుంచి షాకింగ్ ప్రకటన వెలువడింది.
ప్రయాగ్‌రాజ్, కాశీకి రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా ప్రారంభమైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఫిబ్రవరి 26 వరకు ఈ మేళా కొనసాగనుండటంతో ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, దక్షిణ మధ్య రైల్వే అనూహ్య నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్, కాశీ మీదుగా బిహార్ వెళ్లే దానాపుర్ ఎక్స్‌ప్రెస్ (12791), దానాపుర్ ఎక్స్‌ప్రెస్ రిటర్న్ (12792) రైళ్లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను చర్లపల్లి, నల్గొండ, విజయవాడ, భువనేశ్వర్, పట్నా మార్గంలో నడపనున్నారు. అయితే ఇవి ప్రయాగ్‌రాజ్, కాశీ మీదుగా వెళ్లవు.
ప్రత్యామ్నాయ రైలు వివరాలు
చర్లపల్లి-దానాపూర్ (07791) ప్రత్యేక రైలు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 4.45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుతుంది.
భక్తులు ఈ రైళ్ల రద్దుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.