విపక్ష ‘ఇండియా’ కూటమి సారథ్యం ఎవరు చేపట్టనున్నారు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయాలు సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ శివసేన, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ కూడా అనూహ్యంగా ఈ వాదనకు మద్దతు తెలిపింది.
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన మాటల్లో, “మమతా బెనర్జీకి రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఆమెకు విపక్ష పార్టీల కూటమిని సమర్థంగా నడిపించగల నాయకత్వం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించిన అనుభవం మమతకు ప్రత్యేకతని,” అన్నారు.
గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉన్న వైఎస్సార్‌సీపీ, ప్రస్తుతం తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం, బీజేపీ వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారవచ్చని అంచనా వేయడం, జగన్‌ను కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియా కూటమిలో చేరడం ద్వారా వైఎస్సార్‌సీపీకి కాంగ్రెస్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడమే కాకుండా, ఏపీ కాంగ్రెస్‌పై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న షర్మిలా పార్టీ ప్రభావం తగ్గుతుందని జగన్ భావించినట్లు సమాచారం. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వ్యతిరేకంగా విజయవంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఈ అనుభవం విపక్ష కూటమికి ఆమెకు మద్దతుగా మారేందుకు దోహదపడుతుంది.
ఇప్పటి పరిస్థితులు మమతా బెనర్జీకి అనుకూలంగా కనిపిస్తున్నా, తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే విషయంపై దేశ రాజకీయ రంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.