ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా చివరి దశకు చేరుకున్నా, భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో రోడ్లు కిక్కిరిసి, ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ నుంచి సంగమ ప్రాంతానికి చేరుకోవడానికి భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ఈ కారణంగా ట్యాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి.
అయితే, ఈ పరిస్థితిని స్థానిక యువత ఉపాధిగా మలుచుకున్నారు. కాలేజీ విద్యార్థులు తమ స్కూటర్లు, బైకులతో భక్తులకు ట్యాక్సీ సేవలు అందిస్తున్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈ సేవలో పాల్గొంటూ తాత్కాలిక ఉపాధిని పొందుతున్నారు. బైక్ ట్యాక్సీ రైడ్‌కు రూ.100 నుంచి రూ.1000 వరకు ఛార్జ్ వసూలు చేస్తున్నారు.
ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి పీటర్ మాట్లాడుతూ, “ఇది మంచి అవకాశం. రోజుకు రూ.3000-5000 వరకు సంపాదిస్తున్నాం” అని చెప్పాడు. మరో విద్యార్థి విజయ్ మాట్లాడుతూ, “భక్తులు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతుండడంతో వారికి సాయం చేయాలని భావించాను” అని తెలిపాడు.
కేవలం విద్యార్థులే కాదు, కొంత మంది ఉద్యోగులు కూడా అదనపు ఆదాయం కోసం బైక్ ట్యాక్సీలు నడుపుతున్నారు. సెలవులో ఉన్న లడఖ్‌కు చెందిన ఆర్మీ జవాన్ లాల్ బహదూర్ కూడా ఈ సేవలను అందిస్తున్నాడు.
కుంభమేళాకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి పూనమ్ మాట్లాడుతూ, “బైక్ ట్యాక్సీ సేవ వల్లనే త్రివేణి సంగమంలో స్నానం చేసి అదే రోజు ఢిల్లీకి తిరిగి వెళ్లగలిగాను” అని అన్నారు. అయితే, కొందరు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరిగే ఆరో రాజస్నానంతో ముగియనుంది. ఇప్పటివరకు 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానం చేశారు.