తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ డిసెంబర్ 6వ తేదీన అమెరికాలోని డాలస్లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేల మందికి పైగా ప్రవాస తెలుగువారితో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఎన్నారై టీడీపీ (NRI TDP) సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే, సభ ఏర్పాట్లపై నిన్న (ఆదివారం) సాయంత్రం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ సభ ఏర్పాట్లను సజావుగా నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ సభ్యులు సమగ్ర కార్యచరణ రూపొందించారు.
సభ ఏర్పాట్ల కోసం కమిటీలు:
సభ నిర్వహణ కోసం ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనితో అనుసంధానం చేసుకుంటూ సెక్యూరిటీ, భోజనాలు, స్వాగత సన్నాహకాలు, వేదిక ఏర్పాట్లు వంటి వివిధ బాధ్యతలను నిర్వహించేందుకు పలు ఇతర కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాలుపంచుకునేందుకు ఆసక్తి ఉన్న ఇతర సభ్యులు తమ పేర్లు, కాంటాక్ట్ వివరాలను లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఎన్నారై టీడీపీ సూచించింది.
స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైనవారు:
- సుధీర్ చింతమనేని
- చంద్రశేఖర్ కాజా
- నవీన్ యర్రంనేని
- రామకృష్ణ గుళ్లపల్లి
- కిషోర్ చలసాని
- లోకేష్ కొణిదల
- దిలీప్ చంద్ర
- పూర్ణ గరిమెళ్ల
- అమర్ అన్నే
- అనిల్ తన్నీరు
వీరంతా సభ విజయవంతం కోసం సమన్వయంతో కృషి చేయనున్నారు.




































