ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ఇలాగే చేస్తున్నారు. 2022లో కార్గిల్‌లో, గత సంవత్సరం చైనా సరిహద్దులోని లేప్చా సైనిక శిబిరంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సారి కచ్‌లోని సర్ క్రిక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు మోడీ బోటులో చేరుకున్నారు. సైనిక దుస్తుల్లో వెళ్లిన మోడీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని ప్రధాని మోడీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఒక్క అంగుళం భూమి విషయంలోనూ రాజీ పడబోమని ప్రధాని స్పష్టం చేశారు. కాగా, ఈ భౌగోళిక ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమైనది. పగలు అత్యధిక వేడి, రాత్రుళ్లు అత్యధిక చలి ఉంటుంది. భూభాగం కూడా సవాలుతో కూడుకుని ఉంటుందన్నారు ప్రధాని మోడి.
ఇక వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశ వికాసానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. పటేల్ విగ్రహానికి నివాళులర్పించి స్థానికులతో కలిసి ఐక్యాతా ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దివస్ పరేడ్‌లో పాల్గొని సైనిక సిబ్బంది విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.