దేశమంతా ఇప్పుడు ఎన్నికల ఫీవర్‌తో ఉంది. ఎక్కడ చూసినా గెలుపోటముల గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆరు దశల ఎన్నికలు పూర్తవడం.. ఫలితాలు జూన్ 4న విడుదల కానుండటంతో చాలామంది నేతలు ఫ్యామిలీతో దేశ,విదేశాలలో గడపడానికి వెళ్లిపోయారు. తాజాగా ఏడు దశల పోలింగ్ ప్రచారం ముగియడంతో.. 45 గంటల పాటు ధ్యానం చేయడానికి ప్రధాని మోడీ కన్యాకుమారిలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు గురువారం సాయంత్రం వెళ్లారు.
ప్రస్తుతం ప్రధాని మోడీ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో ఉన్నారు. ధ్యాన మండపం వద్ద మోడీ కూర్చుని ఉన్న ఫోటో, వీడియో విడుదల అవడంతో అవి వైరల్ గా మారాయి.. దీనికి ముందు నరేంద్ర మోడీ కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు కూడా చేశారు. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశమైన .. వివేకానంద రాక్ మెమోరియల్ మండపం వద్ద ప్రధాని మోడీ శనివారం సాయంత్రం వరకు అంటే 45 గంటలు ధ్యానం చేయనున్నారు.
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశమే కన్యాకుమారి.. ఇది జాతీయ ఐక్యత సందేశాన్ని ఇస్తుందని భారతీయ జనతా పార్ీ నాయకులు చెబుతున్నారు. 75 రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రక్రియలో నిరంతరాయంగా పాల్గొన్న నరేంద్ర మోడీ.. ప్రచారం ముగిసిన వెంటనే ముందుగా నిర్ణయించి షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల పాటు ధ్యానం చేయడానికి కన్యాకుమారికి వెళ్లారు.
ప్రస్తుతం అక్కడ ప్రధాని ధ్యానం చేయడంతో ఆ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. ఇక జూన్ 1 న చివరి దశ పోలింగ్ జరగనుందన్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా ఇదే రోజు పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగిసే సమయం ముందు..వారణాసి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ, ప్రధాని మోడీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.