Video: త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం

Modi Takes Holy Dip At Triveni Sangam

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగంలో పవిత్ర స్నానాన్ని అచరించారు. త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ప్రధాని మోదీ దాదాపు అరగంట పాటు ప్రత్యేక పూజలు చేశారు.మరోవైపు మోదీ పర్యటన వల్ల ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది యోగీ ప్రభుత్వం.

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటోంది. అయితే ఒకవైపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం విశేషత సంతరించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ హాజరయి త్రివేణీ సంగమంలో ప్రత్యేక పూజలు చేశారు.

ముందుగా ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్లారు. అరైల్ ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి..తర్వాత మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. తర్వాత గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. తిరిగి బోటులో అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు చేరుకుని.. అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరారు.

మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా కార్యక్రమం ఈ నెల 26న మహా శివరాత్రి రోజుతో ముగియబోతోంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో డే వన్ నుంచి కూడా పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ ప్రతీ రోజూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తెలిపింది.144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కాబట్టి.. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఈ కుంభమేళాకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.