వారణాసి నుంచి 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Flags Off 4 New Vande Bharat Trains from Varanasi Today

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 8, 2025) తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా, బనారస్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం మరియు పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ కొత్త రైళ్ల లక్ష్యం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “వందే భారత్ నెట్‌వర్క్‌ ద్వారా పుణ్యక్షేత్రాలను అనుసంధానించడం జరుగుతోంది. వారసత్వ నగరాలను దేశ ప్రగతికి ప్రతీకగా మార్చడమే మా లక్ష్యం. వందే భారత్ అనేది భారతీయులచే, భారతీయుల కోసం నిర్మితమైన రైలు. ఇది ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక. ఈ ఆధునిక రైళ్లు అభివృద్ధి చెందిన భారతదేశం వైపు మరో మైలురాయిగా నిలవబోతున్నాయి.”

“భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న తీర్థయాత్రలు కేవలం ఆధ్యాత్మిక ప్రయాణాలే కాకుండా, దేశ చైతన్యాన్ని మేల్కొలిపే ఒక మహోన్నత సంప్రదాయం. దేశంలోని ప్రతి పవిత్ర స్థలం భారతీయ సంస్కృతి, విశ్వాసం, ఏకతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర వంటి అనేక తీర్థక్షేత్రాలు మన ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనం.”

“ఇప్పుడు ఈ పవిత్ర స్థలాలను “వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించడం కేవలం రైల్వే విస్తరణ మాత్రమే కాదు— అది భారతీయ సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధిలను ఒకే దారిలో నడిపే మహత్తర కార్యక్రమం. భారత వారసత్వ నగరాలను అభివృద్ధి చిహ్నాలుగా మలచే దిశగా ఇది కీలకమైన అడుగు. “వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్” రైళ్లు భారత రైల్వే భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తున్నాయి.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రారంభించిన కొత్త రైళ్లు (రూట్లు) ఇవే..

ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లు దేశంలోని నాలుగు ముఖ్యమైన ప్రాంతాలకు కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి:

1. బనారస్ – ఖజురహో వందే భారత్:

  • ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక ప్రదేశాలను నేరుగా కలుపుతుంది.
  • ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే ఇది 2 గంటల 40 నిమిషాల వరకు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు వేగవంతమైన, ఆధునిక కనెక్టివిటీని అందిస్తుంది.

2. లక్నో – సహరాన్‌పూర్ వందే భారత్:

  • ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్ వంటి నగరాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.
  • ప్రయాణ సమయాన్ని దాదాపు 1 గంట తగ్గిస్తుంది. ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అంతర్-నగర ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది.

3. ఫిరోజ్‌పూర్ – ఢిల్లీ వందే భారత్:

  • ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే. ఇది ప్రయాణాన్ని కేవలం 6 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
  • ఫిరోజ్‌పూర్, బఠిండా, పాటియాలా వంటి పంజాబ్‌లోని ప్రధాన నగరాలను జాతీయ రాజధాని ఢిల్లీతో అనుసంధానిస్తుంది.

4. ఎర్నాకుళం – బెంగళూరు వందే భారత్:

  • ఈ రైలు కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
  • ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గిస్తుంది. ఇది ప్రధాన ఐటీ మరియు వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here