స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఐఖడ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.మరోవైపు ఈ సారి పంద్రాగస్టు వేడుకలు 2047 వికసిత్ భారత్ థీమ్‌తో జరగుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
జెండా ఎగురవేసిన తర్వాత ప్రధాని మోదీ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత భారత దేశ ప్రజలకు మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలిపి.. ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ @2047 అని తెలియజేశారు. దీనికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి పూలు సమర్పించి నివాళులర్పించారు.మరోవైపు ఢిల్లీలో జరిగిన ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు.
జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శతాబ్దాల తరబడి భారతదేశం బానిసత్వంలో మగ్గిందని గుర్తు చేసిన మోదీ, దేశం కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టి పోరాడారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులకు దేశం రుణపడి ఉందని చెప్పారు. గతంలో 40 కోట్ల మంది స్వాతంత్య్రం కోసం పోరాడారని చెప్పారు. భారతదేశ ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.
2047 నాటికి మనందరి లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. మనమంతా బలంగా అనుకుంటే..2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతేదేశం మారుతుందని పీఎం ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ అనేది 140 కోట్ల మంది భారతీయుల కల అని మోదీ అన్నారు. ప్రపంచానికే అన్నం పెట్టేస్థాయికి భారతదేశం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భారత దేశంలోని న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులను తీసుకురాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను దేశ ప్రజలు నేటికీ సగర్వంగా స్మరించుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.