కలిసికట్టుగా కరోనాపై పోరు, జన్ ఆందోళన్ ‌క్యాంపైన్ ప్రారంభించిన పీఎం మోదీ

PM Modi Launches Jan Andolan Campaign, Appeals Everyone to Unite in Fight Against Corona

దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్లుగా నడుచుకొనేందుకు ఉద్దేశించిన “జన్ ఆందోళన్” ‌ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో అందరూ ఐక్యంగా ఉండాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. “మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని అనుసరించడం” వంటి అంశాలను పాటించాలనే సందేశంతో ఈ జన్ అందోళన్ ప్రచారం సాగనుంది. కలిసికట్టుగా పోరాడితే కోవిడ్ -19 పై విజయం సాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే పండుగలను, శీతాకాలాన్ని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా సంఘటిత కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని, ఆ ప్రణాళిక లో ఈ క్రింది అంశాలు భాగంగా ఉంటాయని తెలిపారు.

  • కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో, ఆయా ప్రాంతాలపై నిర్దిష్ట లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగించనున్నారు. 
  • సరళమైన భాషలో, తేలికగా అర్థమయ్యే సందేశాలను దేశంలో ప్రతి ఒక్కరికీ చేరవేయనున్నారు.
  • అన్ని ప్రసార మాధ్యమాల వేదికలను ఉపయోగించుకొంటూ దేశంలోని అన్ని ప్రాంతాలకు సందేశాలను చేరవేయడం జరుగుతుంది.
  • బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లను, బ్యానర్లను ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఫ్రంట్ లైన్ వర్కర్ ల సాయం తీసుకొంటారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది.
  • ప్రభుత్వ ప్రాంగణాలలో హోర్డింగులు/గోడలపై పెయింటింగులు/ఎలక్ట్రానిక్ ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • ఈ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చేందుకు స్థానిక, జాతీయ స్థాయిలో ప్రభావాన్ని కనబర్చే ప్రముఖుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది.
  • కరోనాపై పోరాట ప్రచారం అందరికి చేరేందుకు మొబైల్ వ్యాన్ లను నడుపుతారు. ఆడియో సందేశాలుతో పాటుగా కరపత్రాలు/వివరణ పత్రాల ద్వారా కూడా అవగాహన ప్రచారం జరుగుతుంది.
  • కోవిడ్-19 కి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పే సందేశాలను ప్రచారం చేయవలసిందిగా స్థానిక కేబుల్ ఆపరేటర్లను సాయం కోరనున్నారు.
  • ఈ సందేశాలను అన్ని వర్గాల వారికి ప్రభావవంతమైన విధంగా తీసుకుపోవడానికి గాను ప్రసార మాధ్యమాల మధ్య సమన్వయ సాధనతో కూడిన ప్రచారాన్ని అన్ని వేదికలలోనూ నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu