కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2, గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి సీఎంలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు ఒక బృందంగా పనిచేయడం నిజంగా ప్రశంసనీయమని మోదీ అభినందించారు. లాక్‌డౌన్ ముగిసాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని, అలా జరిగితే మరోసారి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని మోదీ చెప్పారు. అలా జరగకుండా ఉండేలా ముందుగానే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార మార్గాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ వలన ప్రజల ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎంలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రాణనష్టం జరగకుండా లక్ష్యం పెట్టుకోవాలని పిలుపు నిచ్చారు. మరోవైపు ఈ కాన్ఫరెన్స్ లో పలువురు సీఎంలు మాట్లాడుతూ ఇలాంటి కీలక సమయంలో ప్రధానిగా మోదీ తన నాయకత్వ ప్రతిభ చూపించారని కొనియాడారు. అలాగే తమ తమ రాష్ట్రాల్లో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన పలువురు వ్యక్తులను గుర్తించడంతో పాటుగా వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలను సీఎంలు ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తుంది. అనంతరం కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో వివిధ ఎన్జీవోలు, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు.
[subscribe]