కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కోల్‌కతాలో ట్రాఫిక్ పోలీస్ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు.
ఘటన పై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి కనిపించడం లేదని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. విచారణలో తీవ్ర లోపాలున్నాయని, ఐదు రోజులు గడిచినా విచారణలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. దర్యాప్తును ఇలాగే కొనసాగించేందుకు అనుమతిస్తే అది పట్టాలు తప్పుతుందన్న తల్లిదండ్రుల ఆందోళనను సమర్థించింది.
ఇదే సమయంలో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పీజీటీ) డాక్టర్‌పై సెమినార్ హాలులోనే అమానవీయంగా దాడి జరిగినప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నవారికి తెలియకపోవడం, యాజమాన్యం తీరు పట్ల హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో నిందితుడికి పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయనే సందేహాలతో బాధితురాలి తల్లిదండ్రులు సాక్ష్యాలు మారకుండా స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరినట్టు కోర్టు వెల్లడించింది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలి పై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. అలాగే, ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు చేస్తున్న నిరసనల విషయమై ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను గుర్తు చేస్తూ ఆందోళనలు విరమించాలని సూచించింది. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ డా సందీప్ ఘోష్ రాజీనామా చేసిన తర్వాత మరో పదవి ఎలా ఇచ్చారని, తక్షణం విధుల నుంచి తప్పించి, సెలవుపై పంపాలని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఓ వైద్యుడు.. కేసు సీబీఐకి బదిలీ కావడం సంతోషంగా ఉందన్నారు.