భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి చేరుకున్న ఆమె ఈరోజు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. తద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి భారత రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ముర్ము పవిత్రమైన ఇరుముడి ధరించి శబరిమలకు రావడం విశేషం.
‘పంప’ నుండి శబరిమల ఆలయం వరకు కాలినడకన చేరిన రాష్ట్రపతి, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ 18 పవిత్ర మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్రపతి సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి రావడంతో భక్తులంతా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు, దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేలా ఆలయ పరిపాలన ఇచ్చిన అనుమతి తర్వాత, అత్యున్నత పదవిలో ఉన్న మహిళ ఇరుముడితో దర్శనానికి రావడం ఒక చారిత్రాత్మక సంఘటనగా నిలిచింది.
భక్తులు, ప్రజలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్యాత్మిక పయనాన్ని ప్రశంసిస్తూ, ఆమె భక్తి భావం దేశానికి ఆదర్శమని అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశమంతా ఆధ్యాత్మికతతో నిండిన ఒక స్ఫూర్తిదాయక క్షణంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.