ఢిల్లీలో నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా..

Rekha Gupta Becomes Delhi's Fourth Woman CM

12 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా నియమిస్తూ కాషాయ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ.. సొంతంగానే మెజారిటీని దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలాన్ని సంపాదించుకుంది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనే ప్రశ్నకు చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం రేసులో..డీబీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పర్వేష్ సాహిబ్ సింగ్ , పవన్ శర్మ, కైలాష్ గంగవాల్, శిఖా రాయ్, ఆశిష్ సూద్, అనిల్ గోయల్, రవీంద్ర ఇంద్ర రాజ్ సింగ్, రాజ్ కుమార్ భాటియా పేర్లు వినిపించాయి. అయితే రేఖా గుప్తా పేరును అధిష్టానం ఖరారు చేయడం.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలిగిపోయింది.

గతంలో కూడా కాషాయ పెద్దలు ముఖ్యమంత్రుల ఎంపికలో గోప్యత పాటించారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. మీడియా, సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో వినిపించిన పేర్లు కాకుండా కొత్త వ్యక్తులను ముఖ్యమంత్రులుగా నియమించింది. సామాజిక సమీకరణాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలు.. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రులను నియమిస్తూ వస్తున్నారు.

బినోయ్ సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా.. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. 1996 -97 కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి విభాగానికి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అంతేకాదు దక్షిణ ఢిల్లీ మేయర్ గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆమె ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో షా లిమార్ బాగ్ నియోజకవర్గంలో పోటీ చేసి 68,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి ఈమె పేరును బీజేపీ అధిష్టానం ఎప్పుడో సీఎం అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకున్నా కూడా చివరి వరకూ గోప్యత పాటించింది.

తమ నిర్ణయంపై ఒక కమిటీని నియమించిన అధిష్టానం.. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం రేఖా గుప్తా పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దానికంటే ముందు బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కాగా.. ఆ సమావేశంలోనే రేఖా గుప్తా పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్, అతిషీ తర్వాత రేఖా గుప్తా ఇప్పుడు నాలుగో మహిళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు.