కోల్‌కతాలో ఆర్‌జి కర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినీ హత్యాచారా ఘటనలో న్యాయం కోసం జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగుతున్నాయి. ఘటనపై, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తో చర్చలు ముందుకు సాగకపోవడంతో.. కోల్ కతా జూనియర్ డాక్టర్ల నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనలను విరమించి.. విధులకు హాజరుకావాలని సిఎం మమతా బెనర్జీ కోరుతున్నారు. అయితే, వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు.
పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫంట్ తరపున రాసిన నాలుగు పేజీల లేఖను ఉపరాష్ట్రపతి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా పంపారు. దీనికి తక్షణమే ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అతి దారుణంగా బలైపోయిన తోటి జూనియర్ డాక్టర్ కు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలకు ఉపకమించాలని ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది.
గడచిన 12 సంవత్సరాల్లో నిర్భయ వంటి లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయి. అయితే ఈ సమాజానికున్న చెడ్డగుణం ఏమిటంటే.. వాటన్నింటినీ మరిచిపోయింది అని వైద్యులు లేఖలో తెలిపారు. అలాగే మీరు సంస్థాగతంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టే, మేము మా వృత్తిలో భయం లేకుండా విధులను నిర్వర్తించగలమని లేఖలో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో కేంద్రం తీసుకునే నిర్ణయం మాకు ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందని, తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించారు.