ట్రంప్‌ 2.0లో ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం

Special Invitation To PM Modi In Trump 2.0

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌ 2.0 ప్రభుత్వం కొలువుదీరగా..ఆరునెలల క్రితం భారతదేశంలో నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇద్దరు మిత్రులు అయిన ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోబోతున్నారు. ట్రంప్‌ ప్రత్యేకంగా మోదీని ఆహ్వానించడంతో.. మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

గతేడాది జూన్‌లో భారత్‌లో మూడోసారి ప్రధానిగా.. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. తాజాగా 2024లో విజయం సాధించి.. 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జ్యుడీషియల్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తున్నారు. అక్రమంగా అమెరికా వచ్చిన వలస వాదులను యుద్ధ ఖైదీల్లా చేతులకు బేడీలు వేసి ..వారి వారి స్వదేశాలకు సైనిక విమానాల్లో తరలిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

21 రోజుల్లోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్‌తో తాజాగా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటంతో. ట్రంప్‌ మోదీని అమెరికాకు ఆహ్వానించారు. దీంతో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించగా.. ఈ పర్యటనలో మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమవుతారని విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్‌ మిస్రీ తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో పర్యటించడంతో ఈ పర్యటనకు విశేషత సంతరించుకుంది.

ట్రంప్‌ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొద్ది వారాల్లోనే ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్‌టన్‌ డీసీని సందర్శించనున్న కొద్ది మంది విదేశీ నేతల్లో ప్రదాని మోదీ కూడా ఉన్నారు. ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత అంటే జనవరి 27న మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రపంచ శాంతి, రక్షణ, టెక్నాలజీ, భద్రత, వ్యాపార సంబంధాలతో పాటు ఇతర అంశాలపై మోదీ, ట్రంప్ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. పరస్పర సహకారంతో నమ్మకమైన భాగస్వామ్యం,ప్రపంచ శాంతి గురించి ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

కాగా 2024 నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రంప్‌ రెండోసారి అధ్యక్షపదవిని చేపట్టారు. 2025, జనవరి 20 బాధ్యతలు స్వీకరించారు. మోదీ అమెరికా పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ యాక్షన్‌ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహిస్తారు. థర్మో న్యూక్లియర్‌ రియాక్టర్‌ను కూడా సందర్శించనున్నారు. అనంతరం ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.