బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వర్సెస్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి ఒక్క ముంబయి లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. అయితే సల్మాన్ సెక్యూరిటీ గురించి ఇటు తన కుటుంబం అ టు ప్రభుత్వం , లారెన్స్ జైలు, కోర్టు ఖర్చుల కోసం లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారన్న వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్, గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ మధ్య సాగుతున్న వ్యవహారంలో..జైలు, కోర్టుల పేరుతో ఆ కుటుంబాలు అన్ లిమిటెడ్ గా డబ్బులు ఖర్చు చేస్తున్నారనేది ముంబయి మీడియా మాట.
ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీ కోసం వ్యక్తిగతంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటే, అతడి భద్రత కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలను వెచ్చిస్తోంది. ఇక గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైల్లో సుఖవంతమైన జీవితం గడపడానికి అతడి కుటుంబం ఏడాదికి 40లక్షలు పైనే ఖర్చు చేస్తోందని తెలుస్తోంది. ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన తర్వాత.. సల్మాన్ ఖాన్‌కు వై ప్లస్ భద్రతను కల్పించారు. ఈ మధ్య సల్లూభాయ్డి భద్రతను ఒక లేయర్ పెంచారు.
నిజానికి Y ప్లస్ భద్రత అంటే సల్మాన్ ఖాన్ చుట్టూ నిత్యం 25 మంది వరకూ భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో దాదాపు 2 నుంచి 4 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలతో పాటు, పోలీసు భద్రతా సిబ్బందిని కలుపుకొని 25 మంది భద్రతా సిబ్బంది రెండు షిఫ్టులలో పని చేస్తున్నారు. ఈ భద్రతా బృందానికి 3 వాహనాలు ఉండగా..దీనిలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఉంది.
దీనిని బట్టి సల్మాన్ భద్రతకు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ..ప్రతి నెలా దాదాపు 12 లక్షలు. అంటే ఏడాదికి ఇలా చూసుకుంటే దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేస్తారన్నమాట. ఇటీవల సల్మాన్ ఖాన్ భద్రతపై ఖర్చు కోట్లలో ఉంది. వై ప్లస్ భద్రతతో పాటు.. ముంబయి పోలీసు సిబ్బంది, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుల మోహరింపు, సల్మాన్ భద్రతపై వార్షిక ఖర్చు మొత్తం 3 కోట్లకు చేరుకుంటోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురవడంతో పాటు ఏకంగా సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగినప్పటి నుంచి ముంబయి పోలీసులు అతని భద్రతను పెంచారు.
మరోవైపు పంజాబీ గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌ది జమీందార్ కుటుంబం కావడంతో.. జైలులో ఉన్న అతడిని చూసుకోవడానికి సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని ఫజిల్కా గ్రామంలో లారెన్స్ బిష్ణోయ్ జన్మించాడు. అతడి అసలు పేరు బాల్కరన్ బ్రార్. అతని మేనత్త సూచనతో లారెన్స్ బిష్ణోయ్‌గా పేరు మార్చారు. ఫాజిల్కా గ్రామస్తుల దృష్టిలో మాత్రం.. లారెన్స్ ఎప్పుడూ తగాదాలు ఎరుగని మంచి ప్రవర్తన కలిగిన కుర్రాడే. అత్యంత భయంకరమైన గ్లోబల్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడిగా లారెన్స్ బిష్ణోయ్ మారుతాడని పంజాబీ గ్రామం అస్సలు ఊహించలేదట.
31 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌గా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని బిష్ణోయ్ ఆకర్షించాడు. అతడిపై 80 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. మహారాష్ట్ర నాయకుడు బాబా సిద్ధిఖ్ హత్యతో పాట, చివరకు కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య సమయంలో కూడా లారెన్స్ పేరు వినిపించింది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్యలో కూడా లారెన్స్ పేరు బయటపడింది. ప్రస్తుతం సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. మొత్తంగా ముంబయిలో స్టార్ హీరో వర్సస్ గ్యాంగ్ స్టార్‌గా సాగుతున్న వ్యవహారానికి ముంబయి పోలీసులు ఎలా చెక్ పెడతారో చూడాలి.