వారాంతం తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఊహించని విధంగా భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల భయాలు పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన వార్తలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
సెన్సెక్స్ ఉదయం 71,449 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఒక దశలో 3,900 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇది గత సెషన్ ముగిసిన స్థాయి 75,364.69 తో పోలిస్తే భారీ పతనమే. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 2,700 పాయింట్ల నష్టంతో 72,600 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 900 పాయింట్లు పడిపోయి 22,000 సమీపంలో కొనసాగుతోంది.
ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌లు. ముఖ్యంగా ఫార్మా దిగుమతులపై సుంకాలు విధించనున్నట్లు తెలియడంతో ఫార్మా రంగం తీవ్రంగా ప్రభావితమైంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. ఫార్మా షేర్లతోపాటు టెక్నాలజీ షేర్లలోనూ భారీ అమ్మకాలు జరిగాయి.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి బలహీనత, అమెరికా-యూరప్ టెక్ ఖర్చులపై కోతలతో భారత మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. BSE మిడ్‌క్యాప్ 3.08%, స్మాల్‌క్యాప్ 3.43% పడిపోయాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ 52 వారాల కనిష్టాలను తాకాయి.