ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే మొదటి ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ప్రారంభమవడంతో ఇన్వెస్టర్లు వణికిపోతున్నారు. సెన్సెక్స్ 76000 కంటే దిగువన, నిఫ్టీ 23000 కంటే దిగువన ప్రారంభమయి.. నేటి సెషన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌లు భారీ క్షీణతను చూస్తున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఇంధన రంగ స్టాక్‌లలో అమ్మకాల వల్ల మార్కెట్లో భారీ క్షీణత కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగ సూచీ ఒకటి మాత్రమే లాభాలతో ట్రేడవుతోంది.
బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వారంలోని మొదటి సెషన్‌లోనే పెట్టుబడిదారులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. మార్కెట్లో కొనసాగుతున్న క్షీణత వల్ల BSEలో జాబితా చేయబడిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ 6 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. బీఎస్‌ఇలో లిస్టైన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో 419.51 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది 413.35 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది. దీని అర్థం పెట్టుబడిదారులు 6.16 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
ఉదయం సెషన్‌లో, బీఎస్‌ఈలో ట్రేడవుతున్న 3వేల344 స్టాక్‌లలో 2వేల564 స్టాక్‌లు నష్టపోయి.. 601 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి. 210 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌లో ఉండగా.. 81 స్టాక్స్ మాత్రమే అప్పర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 9 స్టాక్‌లు మాత్రమే పెరుగుతుండగా. 21 స్టాక్‌లు క్షీణతతో ట్రేడవుతున్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే ఆందోళనలు..అంతేకాకుండా కార్పొరేట్ కంపెనీలు ఆర్థిక ఫలితాల పరంగా బాగా లేకపోవడం కూడా స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. తొలిసారిగా సమావేశమయ్యే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నిర్ణయాలు జనవరి 28, 29 తేదీల్లో కీలకం కావడంతోనే.. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.