అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఇప్పట్లో భూమికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత కొద్దిరోజుల క్రితం వారిని భూమిపైకి తీసుకొచ్చే విషయంపై నాసా కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరం ఫిబ్రవరిలో వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపింది.
అయితే, నాసా మరో కీలక ప్రకటన చేసింది. వ్యోమగాములు ఇద్దరిని భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని, మార్చి చివరి వరకు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుందని తెలిపింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 6వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాప్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
నిజానికి వారు ఒక వారంలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ ప్రపోల్షన్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో వారి ఎనిమిది రోజుల యాత్ర కాస్తా అనేక సార్లు పొడిగింపబడుతూనే ఉంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో వ్యోమగాములను విడిచిపెట్టి స్టార్ లైనర్ భూమికి తిరిగి వచ్చింది.
అయితే..అప్పటి నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం నాసా తెలిపిన వివరాల ప్రకారం.. వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెల తరువాతే మొదలవుతుందని తెలుస్తోంది.