సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. వైరల్ గా మారిన ల్యాండింగ్ విజువల్స్

తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన వీరు, భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అయిన వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఆపై స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ నుంచి ఆస్ట్రోనాట్‌లను బయటకు తీసుకువచ్చారు. ఊహించని సవాళ్లతో నిండిన ఈ మిషన్ సురక్షితంగా ముగియడంతో నాసా, స్పేస్‌ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల సంస్థలలో సంబరాలు వెల్లివిరిశాయి.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9 సభ్యులు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా భూమిని విజయవంతంగా చేరుకున్నారు. ఈ ఘట్టాన్ని నాసా X, యూట్యూబ్, NASA+లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకున్న తర్వాత పారాచూట్‌లను తెరిచి ల్యాండింగ్‌ను సురక్షితంగా నిర్వహించారు. ల్యాండింగ్ అనంతరం వీరిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు భూ గరవతాకర్షణ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయడానికి అనుకూలించాల్సిన అవసరం ఉంటుంది.

స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు రాగానే సునీతా విలియమ్స్ నవ్వుతూ అభివాదం చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మూడో అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. భారత మూలాలున్న సునీత సురక్షితంగా భూమికి చేరుకోవడంతో భారతదేశంలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గుజరాత్‌లో ఆమె బంధువులు టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.

సునీతా విలియమ్స్ తొలుత 8 రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు, అయితే వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో ఆమెకు అనివార్యంగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ రోజుకు 15 సార్లు తిరుగుతూ ఉంటుంది. అక్కడ శూన్య గరవతాకర్షణ వాతావరణంలో వ్యోమగాములు తేలియాడుతూ ఉంటారు. దీని ప్రభావం శరీరంపై పడటంతో, తిరిగి భూమికి వచ్చాక వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రత్యేకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

గతంలో కల్పనా చావ్లా వ్యోమనౌక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, సునీతా సురక్షితంగా తిరిగి రావాలని భారతదేశంలో పూజలు జరిగాయి. భూమికి వచ్చిన అనంతరం, భారతదేశాన్ని సందర్శించాలని భారత ప్రధాని ఆమెకు లేఖ రాశారు. ఈ మిషన్ విజయంతో అంతరిక్ష పరిశోధనల పరంగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది.