దేశంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను వెల్లడించే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల అభ్యర్థుల నేరచరిత్రలను ఎంపిక చేసిన 48 గంటలలోపు బహిరంగంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆపేందుకు, రాష్ట్రాల హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించడం కుదరదని సుప్రీంకోర్టు పేర్కొంది. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చింది. అయితే అప్పుడు అభ్యర్థులు నేరచరిత్ర వివరాలను ఎంపిక చేసిన 48 గంటలలోపులో లేదా నామినేషన్ పత్రాలను దాఖలు చేసే మొదటి తేదీకి కనీసం రెండు వారాల ముందు వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పింది. తాజాగా ఆ గడువును కేవలం 48 గంటలకే పరిమితం చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
నేరచరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తులను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలను పాటించనందుకు సీపీఐ(ఎం) మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాయి. అనంతరం అన్ని రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర/క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులను ఎందుకు ఎంచుకున్నాయో తెలపాలని, అలాగే అభ్యర్థులను ఎంపిక చేయడానికి గల కారణాలను,కేసుల వివరాలను వారి పార్టీ వెబ్‌సైట్లలో పొందుపరచాలని కోర్టు పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పార్టీల గుర్తులను నిలిపివేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ