పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ధీటైన సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతోంది. దీంతో.. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అణుబాంబులతో సిద్ధంగా ఉన్నామంటూ పాక్ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా..లోపల మాత్రం వణికిపోతుంది. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇస్తున్న విషయాలు ఆధారాలతో తెలిస్తే.. ప్రపంచంలో అందరి దగ్గర పాక్ ఒంటరి అవుతుందని ముందస్తు చర్యలకు రెడీ అయింది.
పీవోకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లకు తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం కూడా ఉండటంతో.. పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేస్తున్నాయి. భారత దాడులను అడ్డుకోవడానికి ఉగ్రవాదులందరినీ ఆక్కడి నుంచి తరలిస్తున్నారు.
పీఓకే ప్రాంతంలో చాలా లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కాసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి . కెల్, సర్ది, దుధ్నియల్, మంధర్, నికైల్, చమన్‌కోట్, అత్ముకం, జురా, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, జంకోట్ లిపా, పచ్చిబన్ నుంచి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
చాలా కాలంగా ఈ లాంచ్ ప్యాడ్‌లు ఉగ్రవాదులను ఎల్‌ఓసీ దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేవేశించడానికి..దీంతోపాటు ఉగ్రవాదులను సమీకరించే కీలక కేంద్రాలుగానూ పని చేస్తున్నాయి. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత నిఘా, ముందస్తు చర్యల నుంచి తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి పాక్ తన ప్రయత్నాలు చేస్తుంది.. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్‌ఓసీ వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన విషయం తెలిసిందే.
దీంతో వెంటనే భారత భద్రతా దళాలు పీఓకే అంతటా పనిచేస్తున్న కనీసం 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి.. నిఘా పెట్టింది. 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రస్తుతం వివిధ శిబిరాల్లో ఉంటూ, చొరబాటు ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా సంస్థలు తెలిపాయి. హిజ్బుల్ ముజాహిదీన్ , జైష్-ఎ-మొహమ్మద్ , లష్కరే-ఎ-తోయిబా నుంచి దాదాపు 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లో చురుగ్గా ఉన్నారని నిఘావర్గాలు గుర్తించాయి. వీరితో పాటు 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నారని నిఘా వర్గాలు తేల్చాయి. కానీ ఇప్పుడు భారత్ భయంతో అవన్నీ పాక్ ఖాళీ చేస్తుండటం చర్చనీయాంశం అయింది.