యాంటీబయాటిక్స్, అలెర్జీ మందులు, నొప్పి నివారణ, మల్టీవిటమిన్, జ్వరం, అధిక రక్తపోటు కోసం సొంతంగా మందులు వాడుతున్న వారు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా14 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించిన విషయం గురించి తెలిసిందే. తాజాగా 156 మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉన్న 156 రకాల మందులను నిషేధించింది. ఈ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని ప్రజలని హెచ్చరించింది.
చాలా మంది ఒక రోగానికి.. వివిధ రకాల మందులు కలిపి వాడుతూ ఉంటారు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మెడిసిన్‌ను కాంబినేషన్ డ్రగ్స్‌గా వాడుతూ ఉంటారు. అయితే ఒక రోగానికి నిర్దిష్టమైన మెడిసిన్ ఉండగా.. అవి కాకుండా కాంబినేషన్ డ్రగ్స్ వాడటంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి కాంబినేషన్ డ్రగ్స్ వాడడం వల్ల.. లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని పేర్కొంది. ఇందులో ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీ కి వాడే మందులు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీబయోటిక్, నొప్పి నివారణ, మల్టీ విటమిన్లు కూడా ఉన్నాయి. నిషేధ జాబితాలో చేరిన మందులలో మెఫెనామిక్ యాసిడ్, పారాసిట్మాల్ ఇంజెక్షన్ కలయిక ఉంటుంది. ఇది నొప్పి, వాపు తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదనంగా, ఓమెప్రజోల్ మెగ్నీషియం, డై సైక్లో మైన్ HCl కలయిక కూడా చేర్చింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఈ కలయిక కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ల వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. దీని వల్ల రోగులకు తక్కువ ప్రయోజనం, ఎక్కువ నష్టం జరుగుతుందని వివరించింది.
రెండు లేదా మూడు ఔషధాలను కలిపి నిర్దిష్ట నిష్పత్తిలో తయారు చేసే మందులను ఎఫ్‌డీసీ(FDC) అంటారు. వీటిని కాక్‌టెయిల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలపై అధ్యయనం చేసి అవి వాడకం మంచిది కావని నిర్థారించిన తర్వాత వాటిపై నిషేధం విధించారు. చిన్న చిన్న జబ్బులకు సైతం సొంత వైద్యం పనికిరాదని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇష్టానుసారం మందుల దుకాణాల నుంచి టాబ్లెట్ కొని తీసుకోరాదని సూచించారు. దీర్ఘకాలంలో అవి అవయవాలపై దుష్ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.