జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోని 90 సీట్లకు మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. రేపు (బుధవారం) రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న తొలిదశ పోలింగ్ కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో దాడుల భయంతో ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారు కాదు. ఈసారి ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్ధితుల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం కూడా భద్రతా బలగాలకు సవాలుగానే కనిపిస్తోంది. కశ్మీర్‌లో ప్రజలు సురక్షితంగా ఉన్నారని బీజేపీ చెబుతుంటే స్థానిక పార్టీలతో పాటు కాంగ్రెస్ మాత్రం అమర్ నాథ్ యాత్రికులకు సైతం భద్రత కల్పించాల్సి వస్తోందని గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సైతం సవాలుగా మారింది.
కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుండగా.. బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు ఒంటరిగానే ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. దేశ భద్రతకు అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా గెలిచి కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అగ్రనేతలు జమ్మూ కాశ్మీర్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిన్న దీంతో (సెప్టెంబర్ 16) జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు వేర్వేరు బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా.. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కూటమిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, ఎన్సీ కూటమి అధికారంలో వస్తే జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్కు బీజేపీనే శ్రీరామరక్ష అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొందని.. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ తగ్గుముఖం పట్టాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా పాతిపెడతామన్నారు అమిత్ షా.
ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఎలక్షన్స్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ తాజాగా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. విజయం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోన్న కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు పలు హామీలతో ఈ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలను అందులో పొందుపరిచారు. ఈ ఎలక్షన్స్‌లో తమ పార్టీ విజయం సాధిస్తే అన్ని పంటలకు బీమా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ అలాగే కిలో యాపిల్‌కు కనీస మద్దతు ధర రూ.72 చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది. భూమిలేని, కౌలుదారులకు ఏడాదికి అదనంగా రూ. 4 వేలు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న భూమిలేని రైతులకు 99 ఏళ్ల లీజును కూడా ఇస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం రాజకీయపరంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీ జమ్మూకాశ్మీర్లో బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా గెలవడం ఆపార్టీకి నైతిక స్థైర్యాన్ని నింపుతుంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే అది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీన పడుతున్నదనే సంకేతంగా మారవచ్చు.