హనీ ట్రాప్..కొన్నాళ్లుగా భారత్‌ను వణికిస్తున్న పేరు. ఒకప్పుడు దేశ రహస్యాలను తెలుసుకోవడానికి రక్షణ రంగంలో ఎక్కువగా వినిపించే పేరు కొన్నాళ్లుగా అన్ని రంగాలకు విస్తరించింది. ముఖ్యంగా పొలిటీషియన్లు కూడా ఎక్కువగా హనీట్రాప్‌లో పడుతున్నారు. అందమైన అమ్మాయి వలపు వలలో చిక్కుకున్నామని అనుకునేంతలోగా.. వగలాడి వలలో చిక్కుకుపోయామని తెలుసుకుని నిర్ఘాంతపోతున్నారు. కానీ అప్పటికే తమకు, దేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. తాజాగా ఇదే విషయంలో కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీ సాక్షిగా బాంబు పేల్చడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.
హనీ ట్రాప్‌లో 48 మంది రాజకీయ నాయకులు చిక్కుకున్నారని, వారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారంటూ .. కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. హనీట్రాప్‌లో చిక్కుకున్నఈ నేతలంతా ఏ ఒక్క పార్టీకో చెందిన వారు కాదని, అన్ని పార్టీల వాళ్లు ఉన్నారని.. ఈ అంశంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాజన్న డిమాండ్ చేశారు. ఈ హనీట్రాప్‌కు సంబంధించి న సీడీలు, పెన్ డ్రైవ్‌లలో 48 మంది రాజకీయ నేతలు బాధితులుగా ఉన్నారని చెప్పిన కేఎన్ రాజన్న.. తాను తన పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారని అనడం లేదని ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా దీనిలో ఇరుక్కున్నారని చెప్పుకొచ్చారు.
హనీట్రాప్‌లో తూంకూరుకు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు చిక్కుకున్నట్లు నివేదికలు ఉన్నాయి..అయితే తూంకూరుకు చెందిన మంత్రుల్లో ఒకడిని తాను మరొకరు డాక్టర్ పరమేశ్వర అని రాజన్న క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరికి సంబంధించి అనేక కథలు బయటకు వస్తున్నాయని.. వాటి గురించి తాను అసెంబ్లీలో స్పందించనని మంత్రి అన్నారు. హనీట్రాప్ అంశంపై తాను హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ హనీట్రాప్ వెనుక ఎవరున్నారు? దీన్ని నడిపిస్తుందెవరనే విషయాలన్నీ కూడా బయటకు రావాలని ..అవన్నీ ప్రజలకు తెలియాలని కేఎన్ రాజన్న డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాజన్న కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర కూడా.. 6 నెలలుగా రాజకీయ నాయకులను హనీట్రాప్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరగాలని కేబినెట్ మినిస్టర్ చెప్పారని.. హెం మంత్రి కూడా సానుకూలంగా స్పందించి, దర్యాప్తు చేస్తారని తాను భావిస్తున్నట్లు రాజేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
బాధితులకు వాట్సప్ కాల్ లేదా మెసేజ్‌లు పంపించి.. ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాజేంద్ర చెప్పుకొచ్చారు. ఆరు నెలలుగా ఇది కొనసాగుతూనే ఉందన్న ఆయన.. రెండు నెలల నుంచి ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని… దర్యాప్తు పూర్తిగా జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా, కర్ణాటక మంత్రిపై రెండు సార్లు హనీట్రాప్ ప్రయత్నం జరిగినట్లు ప్రజా పనుల శాఖ మంతరి సతీశ్ జార్కిహోళి కూడా ఇప్పటికే ధృవీకరించారు.