కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి రాజ్యసభలో మెజారిటీ మార్క్‌ను చేరుకుంది. రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తొలిసారి మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96 కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112 కి చేరింది. దీంతో పార్లమెంట్ ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం కానుంది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ మార్కును అధిగమించింది.
12 స్థానాలకు గాను 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరూ ఏకపక్షంగా విజయం సాధించారు. ఇందులో అస్సాం నుంచి హర్యానా వరకు సీట్లు ఉన్నాయి. ఈ 9 స్థానాలపై విజయం బీజేపీ కి బలమైన, నిర్ణయాత్మకమైన సంస్థాగత సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది. 9 మంది బీజేపీ అభ్యర్థుల్లో రాజస్థాన్ నుంచి రవ్‌నీత్ సింగ్ బిట్టు, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, బీహార్ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఎన్నికయ్యారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా ఉన్నారు. అస్సాం నుంచి రామేశ్వర్ తేలీ, మిషన్ రంజన్ దాస్, మహారాష్ట్ర నుంచి ధీర్య షీల్ పాటిల్ ఉన్నారు.
కాగా రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభ లో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 19. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష లీడర్ హోదా పొందాలంటే పార్టీ కి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి.