పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు కేంద్రం అతి త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనుంది. వాహనదారులకు శిరోభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ప్రభుత్వ ఎక్సైజ్ సుంకంలో మార్పులు, ప్రపంచ భౌగోళిక రాజకీయ సంఘటనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక అంశాలపై పెట్రోల్, డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి. కాగా, చమురు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో జూన్ 2022లో గరిష్ఠంగా బ్యారెల్ ధర 115 డాలర్లుగా రికార్డైంది. ప్రస్తుతం 70 డాలర్లకు చేరింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే బాగా తగ్గిస్తున్నట్లుగానే అనిపిస్తోంది. ఉన్నపళంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన కేంద్రానికి రావడం వెనుక ప్రధాన కారణం ఉంది. అది ఏమిటంటే క్రూడాయిల్ ధ 70 డాలర్లకు చేరువలో ఉండటంతో ఈ మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ లో హర్యానా మహారాష్ట్రతో పాటు పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే కేంద్రం ఈ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలనే ఎత్తుగడ వేసిందని విపక్షాలు, మార్కెటింగ్ నిపుణులు చర్చించుకుంటున్నారు.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.87.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.103.44 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర లీటరుకు రూ.91.76గా ఉంది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.102.86 ఉండగా, డీజిల్ ధర రూ.88.95 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.85 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.44గా ఉంది. అదే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 ఉండగా, అదే డీజిల్ ధర లీటర్‌కు రూ.95.65 ఉంది.