ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రూట్ క్లియర్ అయింది. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెల్లడించింది. గతంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును.. ఈ ధర్మాసనం పక్కకు పెట్టింది.
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు పైకి రాలేకపోతున్నారని.. ఇందుకు కారణం వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న విపక్షనేనని తీర్పు సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుందని.. అందుకోసమనే 2004లో అప్పటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. అయితే జస్టిస్ బేలా ఎం. త్రివేది మాత్రం ఇందుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే ఏబీసీడీ వర్గీకరణ చేసే భాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ఆర్డినెన్స్‌ను త్వరలోనే తీసుకొచ్చి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ