దేశంలో తీవ్ర కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్ళీ మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని తాజాగా ఓ నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐడీఎం) అక్టోబర్ నాటికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, అప్రమత్తంగా ఉండాలని తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎంఓ) తమ నివేదికను సమర్పించినట్టు తెలుస్తుంది. థర్డ్ వేవ్‌లో పెద్దలకు లాగానే పిల్లలకు సైతం కరోనా ముప్పు ఉండొచ్చని, అయితే పిల్లలపై మాత్రమే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పే ఆధారాలు ఎక్కడా లేవని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.
ఒకవేళ థర్డ్ వేవ్ లో పిల్లలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడితే, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు మరియు అంబులెన్సుల వంటి పరికరాలతో సహా పీడియాట్రిక్ సదుపాయాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. పిల్లలపై వైరస్ విజృంభిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు అవసరానికి తగ్గ స్థాయిలో లేవని తెలిపారు. అదేవిధంగా పిల్లల వెంట హాస్పిటల్స్‌లో ఉండే గార్డియన్స్ సురక్షితంగా ఉండేలా ప్రత్యేక కొవిడ్ వార్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు త్వరగా వ్యాక్సిన్ ప్రారంభించకపోతే పెద్ద సవాల్ గా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఇక దేశంలో ప్రారంభమవుతున్న పాఠశాలల నిర్వహణ కూడా అన్ని కరోనా నిబంధనలు, డేటా, భద్రతా చర్యల ఆధారంగా ఉండాలని నివేదికలో సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు నీతి ఆయోగ్ కూడా తమ నివేదికలో కరోనా థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే కోవిడ్-19 వేవ్ లో, 23 శాతం మంది ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉంటుందని, అలాగే 2 లక్షల ఐసీయూ బెడ్స్ ను కేంద్రం సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ ప్రధాన సభ్యుడు వికె పాల్ తెలిపారు. సెప్టెంబర్ లోనే దేశంలో ప్రతిరోజూ 4-5 లక్షల కరోనా వైరస్ కేసులు సంభవించే అవకాశముందని తమ నివేదికలో హెచ్చరించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ