భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం గౌరవించే వ్యాపారవేత్త రతన్ టాటా తన 86వ ఏట మరణించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వ్యాపారవేత్తగా లాభాలను మాత్రమే చూడకుండా దేశానికి ఎనలేని సేవ చేసారు. కాగా, 1937 డిసెంబర్ 28న నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1991 సంవత్సరంలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 10 వేల కోట్లుగా ఉన్న టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని లక్ష కోట్లకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి.
రతన్ టాటా గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు.
1. గొప్ప వ్యవస్థాపకుని మనవడు
రతన్ నావల్ టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్సెట్జీ టాటా యొక్క ముని మనవడు. నావల్ టాటా మరియు సునీ టాటా దంపతులకు డిసెంబర్ 28, 1937న ముంబైలో జన్మించారు.
2. అమ్మమ్మ ఆశ్రయంలో పెరిగిన రతన్
వివిధ కారణాల వల్ల 1948లో రతన్ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా ఆశ్రయంలో పెరిగాడు.
3. వివాహం
రతన్ టాటా తన జీవితంలో ఎన్నడూ వివాహం చేసుకోలేదు. గతంలో నాలుగైదు సార్లు పెళ్లి చర్చలు జరిగినా రతన్ పెళ్లికి అంగీకరించలేదు.
4. అమెరికాలో ప్రేమ..
అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. దీని వెనుక ఓ పెద్ద ప్రేమకథ ఉంది. రతన్ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా భారతదేశానికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్-చైనా యుద్ధం జరుగుతోంది, దాంతో ఆ యువతి భారత్‌కు రావడానికి అనుమతి లేకపోవడంతో వారి ప్రేమకథ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు.
5. అట్టడుగు స్థాయి నుండి కెరీర్ ప్రారంభం..
రతన్ టాటా తన కెరీర్‌ను 1961లో ప్రారంభించారు. టాటా స్టీల్స్ లో స్వయంగా పని చేయడం ద్వారా నేర్చుకుని స్వీయ అనుభవంతో పైకి వచ్చారు. ఇది తన భవిష్యత్ నిర్ణయాలలో తనకు బాగా సహాయపడిందని రతన్ టాటా స్వయంగా చాలాసార్లు ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు.
6. అతి తక్కువ ధర కారు
భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ సమయంలో, మధ్యతరగతి ప్రజల కోసం అతి తక్కువ ధర కారును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. టాటా నానో, టాటా ఇండికా కార్లు ఆ కంపెనీకు మంచి పేరును తెచ్చాయి.
7. రతన్ టాటా ఆస్తులు
2024లో రతన్ టాటా మొత్తం నికర విలువ రూ.3800 కోట్లు. దాతృత్వ పనుల కోసం ఇచ్చే డబ్బు ఇందులో లేదు
8. సేవ కోసం 60 శాతం డబ్బు
రతన్ టాటా తన సంపాదనలో 60 శాతానికి పైగా టాటా ఛారిటీకి (విరాళం) ఇచ్చేవారు. కోవిడ్ పై పోరాటం కోసం అతను 1,500 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.
9. టాటా నేతృత్వంలోని ప్రధాన కంపెనీలు
టాటా స్టీల్, టాటా మోటార్స్, TCA, టాటా పవర్స్, టాటా కస్టమర్ సర్వీస్, టాటా కెమికల్స్, తాజ్ హోటల్స్, టాటా టెక్నాలజీస్, ఎయిర్ ఇండియా, జాగ్వార్ – ల్యాండ్ రోవర్, టాటా ప్లే, టాటా సాల్ట్, వోల్టాస్, తనిష్క్ జ్యువెల్స్.