ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగులు అందులో హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర రానున్నారు. ఇంతలో బెదరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ గత నెలలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పదిహేను రోజుల ముందు సిద్దిఖీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కాగా, సల్మాన్ ఖాన్ కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్దిఖీని హత్య చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్ ను కూడా తుదముట్టిస్తామని బెదిరించింది. బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చాయి. తాజాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.