నేడు ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా శాఖ చరిత్ర, ప్రాముఖ్యత మీకు తెలుసా?

Today Is World Post Day

నేడు ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకొంటున్నారు. పోస్టల్ సేవల ప్రాముఖ్యతతో పాటు తపాలా శాఖ సహకారాన్ని హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా తపాలా దినోత్సవాన్ని జరుపుకొంటారు.

ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ సేవల పాత్ర గురించి ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించడమే తపాల దినోత్సవం ప్రధాన లక్ష్యం. కేవలం తపాలా సేవల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. సమాజానికి వాటి సహకారాన్ని నొక్కి చెప్పడానికి ఈ రోజు అంకితం చేయబడింది. అంతర్జాతీయ స్థాయిలో పోస్టల్ సేవలపై అవగాహన పెంచడంతో పాటు వాటిని మరింతగా అభివృద్ధి చేయడం తపాల దినోత్సవ లక్ష్యం.

1969 వ సంవత్సరంలో టోక్యో, జపాన్‌లో జరిగిన సదస్సులో అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు . అయితే, జూలై 1, 1876 వ సంవత్సరంలో భారతదేశం యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లో సభ్యత్వం పొందింది. అంతేకాదు.. యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లో సభ్యత్వం పొందిన మొదటి ఆసియా దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.

ఇంటర్నెట్, ఈ మెయిల్ వంటి అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్స్ ఎన్ని వచ్చినా కూడా , పోస్టల్ సేవలు ఇప్పటికీ, ఎప్పటికీ ముఖ్యమైనవే. నిజానికి ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ విస్తరణతో పోస్టల్ సేవల వినియోగం బాగా పెరుగుతూనే వస్తుంది. పోస్టల్ సేవలు వస్తువులను వారి వారి ఇండ్లకు పంపిణీ చేయడమే కాకుండా.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ ఆర్థిక సేవలను కూడా అందిస్తున్నాయి.

తపాలా సేవలు ఆధునిక సమాజానికి అందించే కమ్యూనికేషన్ కు అత్యంత విశ్వసనీయ మాధ్యమంగా పనిచేస్తుంటే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. డిజిటల్ యుగం రాకముందు, ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి ఏకైక మార్గం పోస్టల్ సేవలు పనిచేసేవి. ఈ సేవలు ఇప్పుడు వ్యక్తిగత సందేశాలను పంచుకోవడానికి మాత్రమే కాకుండా వ్యాపారం, ప్రభుత్వ సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయడానికి కూడా మాధ్యమంగా పనిచేస్తుంది.