ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీమాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిహార్ జైలులో ఉండగా తనను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ ఆరోపించారు. తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ సర్కారు అన్ని విధాలుగా యత్నించిందని మండిపడ్డారు. హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రివాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జైలులో నన్ను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు. నేను షుగర్ పేషేంట్‌ను. నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే. వాళ్లు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను హర్యానా బిడ్డను అని కేజ్రీవాల్ అన్నారు.
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలోనూ అప్ ప్రభుత్వమే ఏర్పడుతుందేమో అనే బెంగ ప్రధాని మోడీకి ఉంది అని ఆయన చెప్పారు. అరవింద్ కేజ్రివాల్ ను జైలో వేసి ఢిల్లీలోని 700 ప్రభుత్వ స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్నవాళ్లు ఇలా ఆలోచించకూడదు అని అప్ చీఫ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీరు కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టి 700 స్కూళ్లను మూసివేయాలనుకుంటున్నారు అన్నారు. ఇక హర్యానా ఎన్నికల్లో ఆప్ కింగ్ మేకర్ గా అవతరించబోతోందని.. ఆ పార్టీ అవకాశాలపై కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. మేము లేకుండా హర్యానాలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయరు కాబట్టి మాకు చాలా సీట్లు వస్తున్నాయి అని ఆయన అన్నారు.. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార హామీలు నెరవేరేలా చూస్తామని కేజ్రీవాల్ అన్నారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్‌ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు.