వయనాడ్ ఘటన జరిగి వారం రోజులు దాటిపోయినా ..ఇంకా విషాద ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా ఆచూకీ తెలియని అనేకమంది కోసం ప్రాణాలతో బయటపడినవారు ఎదురుచూస్తున్నవారిని చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. బతికి ఉండరని తెలిసినా..ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న ఆశ వారిని అలాగే ఎదురుచూసేలా చేస్తోంది.అలా ఈ విపత్తులో ఏకంగా 53మంది విద్యార్ధులు గల్లంతయ్యారన్న వార్త వారి కుటుంబసభ్యులను తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.
ఒక్క అనుకోని ప్రకృతి విపత్తు గ్రామాలను తుడిచిపెట్టేసింది. ఎంతోమందిని సజీవ సమాధి చేసేసింది. ఎంతోమందికి నా అనుకున్న బంధాలను నిర్దాక్షణ్యంగా చెరిపేసింది.తాజాగా వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 53 మంది స్కూలు విద్యార్థులు గల్లంతయ్యారని.. వారంతా మరణించి ఉంటారని కేరళ ప్రభుత్వం ప్రకటించడంతో వారివారి కుటుంబసభ్యులు, బంధువులు తల్లడిల్లిపోతున్నారు.
వయనాడ్‌లో మంగళవారం కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి .. ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా 49 మంది విద్యార్థుల కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు కొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మెప్పాడిలోని వొకేషనల్ హైయర్ సెకండరీ స్కూలు, వెల్లార్‌మలలోని బాలికల లోయర్ ప్రైమరీ స్కూలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు కేరళ ప్రభుత్వం త్వరలోనే వీటిని పునర్నిర్మిస్తుందని కాకపోతే తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనను తీర్చలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ ప అనేక మంది విద్యార్థులు తమ కంప్యూటర్లు, సర్టిఫికెట్లు, బుక్స్, ఇతర స్టడీ మెటీరియల్‌లను పొగొట్టుకున్నారని, వీటిని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.ప్రస్తుతం స్కూల్స్‌ను పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నామని..వచ్చే 20 రోజుల్లో ఇందులో తరగతులను పునఃప్రారంభిస్తామని మంత్రి వి.శివన్ కుట్టి చెప్పారు.
కాగా వయనాడ్ విపత్తులో మంగళవారానికి 402 మంది మరణించినట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంకా 180 మంది ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు కేరళ ఎడిజిపి ..ఎం.ఆర్. అజిత్ కుమార్ చెప్పారు. సహాయక, గాలింపు కార్యక్రమాలు ప్రస్తుతానికి తుది దశకు చేరుకున్నాయని.. కానీ మరికొన్ని రోజులు వీటిని కొనసాగిస్తామని అన్నారు. మొత్తంగా వయనాడ్ విపత్తు.. అక్కడి కుటుంబాలకు జీవితానికి సరిపడా విషాదాన్ని ఇచ్చిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.