అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అమెరికాలోని అన్ని గల్లీలు హోరెత్తిపోతున్నాయి.అటు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు,ఇటు గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5 న అమెరికాలో పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగడంతో ..తాజాగా వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే కావడం విశేషం.
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియావారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ కి వేదికగా మారింది. అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ ప్రారంభమవగా… లారా లూమర్.. దీనికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఏబీసీ న్యూస్ ఈ డిబేట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఇద్దరు నేతల షేక్ హ్యాండ్‌తో మొదలైన డిబేట్ లో ముందుగా ఆర్థికాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అమెరికాను ప్రస్తుతం కలవరపాటుకు గురి చేస్తోన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలపై ట్రంప్ దాడికి దిగారు. అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే అమలు చేయదలిచిన ప్రాజెక్ట్ 2025 గురించి కూడా ఆయన క్లుప్తంగా వివరించారు.
ఆ తర్వాత కమలా హ్యారిస్ చైనా అంశాన్ని లేవనెత్తడంతో డిబేట్ హీటు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2016- 2020 మధ్య కాలంలో ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానంతో కమలా ఆయనపై ఎదురుదాడికి దిగారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే అమెరికా ఖజానా ఖాళీ అయిందని, నిరుద్యోగం, ఆర్థిక భారం పడటానికి ట్రంప్ పరిపాలనే ప్రధాన కారణమంటూ హ్యారిస్ ఆరోపించారు.
ట్రంప్ పరిపాలనలో ప్రజారోగ్యం అత్యంత దారుణంగా మారిందంటూ కమలా హ్యారిస్ ఆరోపించారు. అమెరికాలో అంతర్యుద్ధం తరువాత ఆ స్థాయిలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందంటూ ఉదాహరణలు చూపిస్తూ హ్యారిస్ ఆరోపించారు. దాన్ని సరిదిద్దలేనంతగా ట్రంప్ ధ్వంసం చేశారంటూ విమర్శల దాడికి దిగడంతో డిబేట్ మరికాస్త హీటెక్కింది.