అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దోమ కాటుతో విస్తరించే ఈఈఈ అనే కొత్త వైరస్ కు చెక్ పెట్టడానికి ఈ లాక్ డౌన్ ను అమలు చేశారు.అమెరికాలోని హడ్సన్ వ్యాలీ, చుట్టుపక్కల రాష్ట్రాల్లోని.. కొన్ని కౌంటీలలో 30% మరణాల రేటుతో మనుషులకు సోకే అరుదైన, ప్రాణాంతకమైన వైరస్ విజృంభిస్తోంది. దీని గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియదు. ట్రిపుల్ ఈ మొదటి బాధితుడు మసాచుసెట్స్ లోని ఓ వృద్ధుడు అని అక్కడి వైద్యులు తేల్చారు.
మసాచుసెట్స్ లోని డగ్లస్, ఆక్స్ ఫర్డ్, సుట్టన్, వెబ్ స్టర్ అనే నాలుగు పట్టణాల్లో కూడా ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టడానికి స్వచ్ఛంద లాక్ డౌన్ ను అమలుచేస్తున్నట్లు న్యూయార్క్ పొస్ట్ ప్రకటించింది. ముఖ్యంగా సయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో.. ప్రతీ రోజూ సాయంత్రం 6:00 గంటల తర్వాత ఇంటిలోపలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈఈఈ అంటే… ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్ సెఫాలిటీస్ అనే దోమల వల్ల వచ్చే వ్యాధి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెషన్.. దీనిని అరుదైన తీవ్రమైన వ్యాధిగా చెప్పింది. ప్రతీ ఏటా యూఎస్ లో కొన్ని కేసులు మాత్రమే నమోదవుతున్నా..ఈ ఏడాది దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఈస్ట్, గల్ఫ్ కోస్ట్ రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది.
ఇప్పటి వరకూ ఈ వైరస్ ను నివారించడానికి టీకాలు అందుబాటులో లేవు, ప్రత్యేకంగా మందులూ లేవు. ఈ ట్రిపుల్ ఈ వైరస్ సోకే మనుషులు, జంతువులను “డెడ్ ఎండ్ హోస్ట్”లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా… పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. హెలీకాప్టర్లతో దోమలు వ్యాప్తి చెందకుండా అధికారులు మందులు పిచికారీ చేయిస్తున్నారు.