లక్షలాది మందికి అమెరికన్ గ్రీన్ కార్డ్ అంటే తమ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నోట గ్రీన్ కార్డ్ అనే మాట రావడంతో ఇది మరోసారి హాట్ టాపిక్ అయింది.అమెరికాలో ఉండాలని కలలు కనేవారికి గ్రీన్ కార్డు ఇచ్చేస్తానంటున్న ట్రంప్.. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే నంటూ మెలిక పెట్టారు. అదీ కూడా గ్రీన్ కార్డ్ కావాలంటే మరో కార్డు తీసుకోవాలని ఆ కార్డు పేరు గోల్డ్ కార్డ్ అని చెబుతున్నారు.
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తామని ప్రకటించారు. 5 మిలియన్ డాలర్లు అంటే భారతదేశ కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ గోల్డ్ కార్డ్ కొన్నవారికి అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక 100కుపైగా దేశాలు పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డ్‌లను ఇస్తూ, వారికి ఆ దేశ పౌరసత్వాన్ని ఇస్తున్నాయి
నిజానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి 1990లో EB-5 విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డ్ విధానాన్ని తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు. దీంతో 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 విధానం రద్దు చేసినట్లయింది. మరో రెండు వారాల్లోనే ఈ గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుంది. గ్రీన్‌కార్డ్‌కు గోల్డ్ కార్డ్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనీ, ఈ కార్డ్ కొంటే గ్రీన్‌కార్డ్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. గోల్డ్ కార్డ్ పథకం ద్వారా సేకరించిన డబ్బునంతా..తమ దేశ ఆర్థిక లోటును తగ్గించడానికి ఉపయోగిస్తామని చెప్పుకుంటున్నారు.
ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి EB-5 వీసా విధానం మాత్రమే ఉండేది. దీనికి ప్రకారం అమెరికాలో ఎవరైనా బిజినెస్ ప్రారంభించి, కనీసం 10 ఉద్యోగాలు ఇచ్చి.. ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలు, వారికి అక్కడి గ్రీన్ కార్డు లభిస్తుంది . అయిదే EB-5 విధానంలో చాలా అవకతవకలు జరిగాయని ..అందుకే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. 10 లక్షల గోల్డ్ కార్డ్‌లను 5 మిలియన్ డాలర్ల చొప్పున విక్రయిస్తే..ఐదు ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తానని ట్రంప్ అంటున్నారు.అమెరికాలో ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నా కూడా గ్రీన్ కార్డ్‌కు మాత్రం డిమాండ్ పెరుగుతూనే ఉందన్న మాట మాత్రం అక్షర సత్యం.