తాను గెలిస్తే ఎలోన్ మస్క్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విజయం తర్వాత తాను ‘గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కమిషన్’ని ఏర్పాటు చేస్తానని, దాని చీఫ్ ఎలోన్ మస్క్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఓ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. న్యూయార్క్ ఎకనామిక్ క్లబ్‌లో మాట్లాడిన ట్రంప్.. ప్రెసిడెంట్ అయిన తర్వాత దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌లో భారీ కోత పెడతానని అన్నారు. దీంతో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుకు గవర్నమెంట్ భూమి కొనుగోలుపై కూడా ట్యాక్స్ తగ్గుతుందని చెప్పారు.
అంతేకాకుండా కంపెనీల కోసం వెల్త్ ఫండ్‌ను ప్రారంభిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ చాలా వారాలుగా ఎఫిషియెన్సీ కమిషన్ గురించి తన సహాయకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తొలిసారిగా తన ప్రణాళికను బహిరంగంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ కమిషన్‌కు సారథ్యం వహించడానికి ఎలోన్ మస్క్ కూడా అంగీకరించారని ట్రంప్ బయటపెట్టారు. కాకపోతే ఈ కమిషన్ ఎలా పని చేస్తుందో డొనాల్డ్ ట్రంప్ చెప్పలేదు. ఆరు నెలల్లో మోసం, అక్రమ నగదు లావాదేవీలను అరికడతామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
తాను అధికారంలోకి రాగానే అమలయ్యే ఈ కమిషన్‌లో తన మాజీ ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ మునుచిన్, ఇతర సహచరులను కూడా చేర్చనున్నట్లు ట్రంప్ తెలిపారు. గవర్నమెంట్ శాఖల్లో పూర్తి ఫైనాన్షియల్, పెర్ఫార్మెన్స్ ఆడిట్ నిర్వహించే అధికారం సమర్థత అంతా ఆ కమిషన్‌కు ఉంటుందని చెప్పారు. కాగా ఎఫిషియెన్సీ కమిషన్ గురించి గతంలో కూడా అమెరికాలో పెద్ద చర్చ జరిగింది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ 1981లో అటువంటి సంస్థను సృష్టించగా.. దీనికి గ్రేస్ కమిషన్ అని పేరు పెట్టారు. అయితే ట్రంప్ తాజా ప్రకటన తర్వాత ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.