ప్రముఖ తమిళ నటుడు మరియు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ సోమవారం కరూర్ తొక్కిసలాట బాధితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ విషాద ఘటన జరిగి సరిగ్గా నెల రోజుల తర్వాత విజయ్ వీరిని కలవడం గమనార్హం.
భారీ ఆర్ధిక సాయం:
మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్టులో వీరికోసం 50 గదులను బుక్ చేసిన టీవీకే పార్టీ, వారిని అక్కడికి తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఈరోజు విజయ్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన ఆయా కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం అందించారు. మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, గాయపడినవారికి రూ. 2 లక్షలు చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమ పార్టీ మరియు తాను వ్యక్తిగతంగా బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీవీకే పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు. ఇక రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్, ప్రజా సమస్యలు మరియు విషాద ఘటనలపై వెంటనే స్పందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సీబీఐ చేతికి కేసు.. దర్యాప్తు ముమ్మురం:
కరూర్‌లో గత నెల 27న విజయ్ నిర్వహించిన ఈ ప్రచారసభలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు, అనేకమంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీబీఐ అధికారికంగా కేసును స్వీకరించింది. తమిళనాడు పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రీ-రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మురం చేసింది.




































