ఢిల్లీలో పాగా వేయాలన్న 27 ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ సీఎం ఎంపికలో జాప్యం చేస్తోంది. చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్ పనిచేసిన తర్వాత ఢిల్లీలో బీజేపీకి అవకాశం దక్కలేదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లిన కమలం పార్టీ.. ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.
70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. ఆప్ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం ఖాతా తెరవలేదు. స్పష్టమైన మెజారిటీ సాధించినా కూడా సీఎం ఎంపికలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తోంది. ఫిబ్రవరి 17న బీజేపీ కీలక సమావేశం ఉంటుందని,అప్పుడే సీఎంను ఎంపిక చేస్తారని అంతా భావించినా..చివరి నిమిషంలో సమావేశం వాయిదా వేస్తూ ట్విస్ట్ ఇచ్చింది.
ఫిబ్రవరి 19న బీజేపీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు సీఎం ఎంపికతోపాటు కేబినెట్ ఎంపికపైన కూడా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలే.. లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్లి బీజేపీ ఎల్పీ నేత, కేబినెట్ పేర్లు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతారని సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి ఘన విజయం సాధించినా.. సీఎం ఎంపికలో 15 రోజుల సమయం తీసుకుంది. ఏక్‌నాథ్‌షిండే, ఫడ్నవీస్ మధ్య పోటీ ఉండటంతో.. షిండేను ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసి.. చివరకు షిండే లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. చివరి నిమిషంలో షిండే వెనక్కి తగ్గడంతో ఫడ్నవీస్‌కు లైన్ క్లియర్ అయింది.
కానీ ఢిల్లీలో అలాంటి పరిస్థితి లేకపోయినా కూడా సీఎం ఎంపికలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడినా కూడా సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. జేపీ నడ్డా నాయకత్వంలో అధిష్టానం అంతర్గత సంప్రదింపులు జరిపింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో.. ఎంపిక ఆలస్యైంది. కాగా సోమవారం ఢిల్లీలో భూప్రకంపనలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 19న జరిగే కీలక సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు పార్టీ జాతీయ కార్యదర్శులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. బీజేపీ పాలిత ప్రాంతాల తరహాలోనే ఢిల్లీలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. కాగా ఫిబ్రవరి 20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేసులో న్యూ ఢిల్లీ నుంచి పర్వేష్ వర్మ , షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా, రోహిణి నుంచి విజేందర్ గుప్తా ,మాల్వియా నగర్ నుంచి సతీశ్ ఉపాధ్యాయ్, జనక్‌పురి నుంచి ఆశిష్ సూద్ , ఉత్తమ్ నగర్ నుంచి పవన్ శర్మ , ఘోండా నుంచి అజయ్ మహావార్ పేర్లు ఉన్నాయి.