భారత్‌లో 2వేల యూఎస్ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. అమెరికా వెళ్లడానికే చాలామంది భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న వివిధ దేశాలవారు ట్రంప్ మళ్లీ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వణికిపోతున్నారు. అంతా భయపడుతున్నట్లుగానే ట్రంప్‌ ఒక్కొక్కటిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా భారత్‌కు చెందిన 2 వేల బాట్‌ అపాయిట్‌మెంట్లను రద్దు చేసింది అగ్రరాజ్యం అమెరికా.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అధ్యక్షుడు అయ్యాక వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం తాజాగా.. మోసపూరిత కార్యకలాపాల వల్ల 2 వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ అపాయింట్‌మెంట్లు బాట్స్‌ ద్వారా బుక్‌ చేయబడినవని చెప్పిన అమెరికా దౌత్య కార్యాలయం.. షెడ్యూలింగ్‌ వ్యవస్థలో భారీ లోపం గుర్తించామని చెబుతూ.. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. భారత్‌లోని కాన్సులర్‌ బృందం బాట్స్‌ ద్వారా జరిగిన 2 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తమ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను సహించని… ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తూ, సంబంధిత అకౌంట్ల షెడ్యూలింగ్‌ అధికారాలను సస్పెండ్‌ చేస్తున్నామని చెప్పింది. మోసాల నిర్మూలనకు తమ క‌ృషి కొనసాగుతుందని పేర్కొంది.

సాధారణంగా అమెరికా బిజినెస్‌ వీసా బీ1, విజిటర్‌ వీసా..బీ2, స్టూడెంట్‌ వీసాలకు అపాయింట్‌మెంట్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. అంత సమయం వేచి ఉండలేనివారంతా ఏజెంట్ల ద్వారా తమకు అపాయింట్మెంట్ తెచ్చుకుంటారు. ఏజెంట్లకు 30 వేల నుంచి 35 వేల రూపాయలు చెల్లించి నెలలోపే స్లాట్‌ తీసుకుంటారు. సొంతంగా దరఖాస్తు చేస్తే దగ్గరలో స్లాట్లు దొరకకపోవడం వల్ల చాలామంది ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ ఏజెంట్లంతా బాట్స్‌ ఉపయోగించి స్లాట్లను బ్లాక్‌ చేస్తుంటారు. 2023లో బీ1, బీ2 వీసాల వేచి ఉండే సమయం ఏకంగా 999 రోజులకు చేరింది. దీంతోనే అమెరికా.. భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్‌లలో అపాయింట్‌మెంట్లను తెరిచింది.

మూడేళ్ల క్రితం భారత్ ప్రభుత్వం ఈ సమస్యను అగ్రరాజ్యం అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. అయినా కూడా అర్జంటుగా స్లాట్ కావాలనుకున్నవారంతా ఏజెంట్లను ఆశ్రయించడంతో..ఇప్పుడు అమెరికా బాట్స్‌ వినియోగాన్ని అరికట్టడానికి చర్యలు చేపట్టింది. ఈ ఏజెంట్లు బాట్స్‌ ద్వారా స్లాట్లను ఆక్రమిస్తున్నారని..దీని వల్ల సామాన్య దరఖాస్తుదారులు నష్టపోతున్నారని అమెరికా దౌత్య కార్యాలయం చెబుతోంది.