హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజుకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. ట్రంప్ సర్కారు ఇటీవల హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును 1 లక్ష డాలర్లకు (సుమారు ₹88 లక్షలు) పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రొఫెషనల్స్‌లో ఆందోళన కలిగించింది.
అయితే, తాజా ప్రకటనలో ట్రంప్ ప్రభుత్వం కొంత స్పష్టతనిచ్చింది. ఈ భారీ ఫీజు దేశం వెలుపల నుండి సమర్పించే కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది.
ఎఫ్–1, ఎల్–1 వీసాదారులకు ఊరట:
ఇదే సమయంలో, అమెరికాలో ఇప్పటికే చదువుతున్న లేదా పనిచేస్తున్న ఎఫ్–1 (విద్యార్థి) మరియు ఎల్–1 (కంపెనీ అంతర్గత బదిలీ) వీసాదారులు హెచ్–1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు ఈ భారీ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
అంటే, అమెరికాలో ఉన్న వీసాదారులు ఈ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపును పొందనున్నారు. అయితే, ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు లేదా ఇప్పటికే హెచ్–1బీ హోదాలో ఉన్నవారు దేశం విడిచి వెళ్లి మళ్లీ ప్రవేశించడానికి కొత్త దరఖాస్తు సమర్పిస్తే వారికి ఈ ఫీజు తప్పనిసరి అవుతుందని అధికారులు తెలిపారు.
ఫీజు చెల్లింపుకి ప్రత్యేక పోర్టల్:
అదేవిధంగా, హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు అర్హత లేని దరఖాస్తుదారుల తరపున కంపెనీ యజమానులు చెల్లించాల్సిన బాధ్యత నుంచి మినహాయింపు పొందుతారని కూడా వివరించారు. ఇకపోతే, యూఎస్‌సీఐఎస్ తాజాగా ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్ ద్వారా ఫీజు చెల్లింపు సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఈ ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్ ఫీజు చెల్లించి రసీదు సమర్పించిన అభ్యర్థులకే తదుపరి ప్రాసెస్‌లో అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మార్పులతో అమెరికాలోని టెక్ రంగంలో ఉద్యోగావకాశాలపై కొంత ఊరట నెలకొంది.